Pages

Saturday, August 27, 2011

molla rAmAyaNam-bAlakANDa

రామాయణము
బాలకాండము
కథాప్రారంభము

వ. అని విత్కరించి, ముదంబున నిష్టదేవతా ప్రార్థనంబును బురాతన కవీంద్రస్తుయునుం జేసి నాయొనర్పంబూనిన మొల్ల రామాయణ మహాకావ్యమునకుఁ గథాక్రమం బెట్టు లనిన, ||1||
అయోధ్యా పుర వైభవమ్ము

సీ. సరయూ నదీ తీర సతత సన్మంగళ
ప్రాభవోన్నత మహావైభవమ్ము,
కనక గోపుర హర్మ్యఘన కవాటొజ్జ్వల
త్ప్త్రాకార గోపుర శ్రీకరమ్ము,
గజ వాజి రథ భట గణీకాతపత్ర చా
మర కేతు తోరణ మండితమ్ము,
ధరణీ వధూటి కాభరణ విభ్రమ రేఖ
దరిసించు మాణిక్య దర్పణమ్ము

తే. భాను కుల దీప రాజన్య పట్టభద్ర
భాసి నవరత్న ఖచిత సింహాసనమ్ము,
నాఁగ నుతి కెక్కు మహిమ ననారతమ్ము,
ధర్మ నిలయమ్ము, మహి నయోధ్యాపురమ్ము. ||2||

సీ. మదనాగ యూధ సమగ్ర దేశముగాని
కుటిల వర్తన శేష కులము గాదు
ఆహ వోర్వీజయ హరి నివాసము గాని
కీశ సముత్కరాంకితము గాదు
సుందర స్యందన మందిరం బగుఁగాని
సంతత మంజులాశ్రయము గాదు,
మోహన గణికా సమూహ గేహము గాని
యూథికా నికర సంయుతము గాదు.

తె. సరస సత్పుణ్యజన నివాసమ్ముగాని
కఠిన నిర్దయ దైత్య సంఘమ్ముగాదు,
కాదు కాదని కొనియాడఁ గలిగి నట్టి
పుర వరాగ్రమ్ము సాకేత పుర వరమ్ము. ||3||

సీ. భూరి విద్యా ప్రౌఢి శారదా పీఠమై
గణుతింప సత్య లోకమ్ము వోలె,
మహనీయ గుణ సర్వమంగళావాసమై
పొగడొందు కైలాస నగము వోలె,
లలిత సంపచ్ఛాలి లక్ష్మీ నివాసమై
యురవైన వైకుంఠ పురము వోలె,
విరచిత ప్రఖ్యాత హరిచంద నాఢ్యమై
యారూఢి నమరాలయమ్ము వోలె,

తే. రాజ రాజ నివాసమై తేజరిల్లి
నరవ రోత్తర దిఘ్భాగ నగరి వోలె
సకల జనములు గొనియాడ జగములందుఁ
బొలుపు మీరును సాకేత పుర వరమ్ము. ||4||

క. ఇమ్ముల న ప్పురి వప్రము
కొమ్ములపై నుండి పురము కొమ్ములు వేడ్కన్
దమ్ముల చుట్టము పద జల
జమ్ములు పూజింతు రొగి నజస్రముఁ బ్రీతిన్. ||5||

క. పరువున మురువై యుండును
సురపురమునఁ గల్ప తరులు చూపఱకింపై;
పరువున మురువై యుండును
దురగంబు లయోధ్యఁ గల ప్రతోళికలందున్. ||6||

క. దాన గునమ్మున సురపురి
నే నాఁడును నమర రత్న మెన్నిక కెక్కున్;
దాన గుణంబున మిక్కిలి
యేనుఁగు లా పురములోన నెన్నిక కెక్కున్. ||7||

క. కవి గురు బుధ మిత్త్రాదులు
వివిధార్చనలను సురపురి వెలయుదు రెలమిన్;
గవి గురు బుధ మిత్త్రాదులు
వివి ధార్చనలం బురమున వెలయుదు రెపుడున్. ||8||

క. భోగానురాగ సంపద
భోగులు వర్తింతు రందు భూ నుత లీలన్;
భో గానురాగ సంపద
భోగులు వర్తింతు రిందు భూ నుత లీలన్, ||9||

సీ. ప్రకటాగ్ని హోత్ర సంపన్ను లౌదురు గాని
రమణీయ రుక్మ కారకులు గారు,
షుభ పవిత్రోజ్జ్వల సూత్ర ధారులు గాని
టక్కరి హాస్య నాటకులు గారు,
ఉభయ సంధ్యాది విధ్యుక్త కర్ములు గాని
చర్చింపఁగా నిషాచరులు గారు,
తిలమించి చూడ సద్ద్విజు లౌదురే కాని
తలఁపంగఁ బక్షి జాతములు కారు,

బాడబులు గాని యగ్ని రూపములు గారు,
పండితులు గాని విజ్ఞుల పగిదిఁగారు,
ధీవరులు గాని జాతి నిందితులు గారు,
పరమ పావను లా పురి ధరణి సురులు. ||10||

ఉ. రాజులు కాంతియందు, రతి రాజులు రూపమునందు, వాహినీ
రాజులు దానమందు, మృగ రాజులు విక్రమ కేళియందు, గో
రాజులు భోగమందు, దిన రాజులు సంతత తేజమందు, రా
రాజులు మానమందు, నగరమ్మున రాజ కుమారులందఱున్ ||11||

సీ. తగ దాన విఖ్యాతి ధరఁ గుబేరులు గాని
సత తాంగ కుష్ట పీడితులుగారు,
నిర్మల సత్యోక్తి ధర్మ సూతులు గాని
చర్చింప ననృత భాషకులు గారు,
ప్రకట విభూతి సౌభాగ్య రుద్రులు గాని
వసుధపై రోష మానసులు గారు,
కమనీయ గాంభీర్య ఘన సముద్రులు గాని
యతులిత భంగ సంగతులు గారు,

తే. వర్తకులు గాని పక్షులే వరుసఁగారు,
భోగులే గాని పాము లెప్పుడును గారు,
సరసులే కాని కొలఁకుల జాడఁగారు,
వన్నె కెక్కిన యప్పురి వైశ్యులెల్ల. ||12||

క. పంటల భాగ్యము గలరై
పంటలపైఁ బంట లమర బ్రతుకుదు రెపుడున్
బంటలుఁ బాడియుఁ గల యా
పంటలు మొదలైన కాఁపుఁ బ్రజలా నగరిన్. ||13||

సీ. కలికి చూపులచేతఁ గరఁగింప నేర్తురు
బ్రహ్మచారులు నైన భ్రాంతి గొలిపి,
మృదువచో రచనల వదలింప నేర్తురు
ఘన మునీంద్రుల నైనఁ గచ్చడములు,
వలపులు పైఁజల్లి వలపింప నేర్తురు
సన్న్యాసులను నైనఁజలముపట్టి,
సురత బంధమ్ములఁ జొక్కింప యతుల నైన,

తే. నచల మెక్కింప నేరుతు రౌషధముల,
మరులు గొలుపంగ నేర్తురు మంత్రములను,
ధనము లంకింప నేర్తురు తక్కుసేసి,
వాసి కెక్కిన యప్పురి వారసతులు. ||14||

సీ. శారద గాయత్త్రి శాండిల్య గాలవ
కపిల కౌశిక కుల ఖ్యాతి గలిగి,
మదన విష్వక్సేన మాధవ నారద
శుక వైజయంతి కార్జునులు గలిగి,
చం ద్రార్క గుహ గిరిసంభవ జయ వృష
కుంభ బాణాదులఁ గొమరు మిగిలి,
సుమన ఐరావత సురభి శక్రామృత
పారిజాతముల సొంపారఁ గలిగి,

తే. బ్రహ్మ నిలయము, వైకుంఠ పట్టణమ్ము,
నాగ కంకణు శైలమ్ము, నాక పురము,
లలిత గతిఁ బోలి, యే వేళఁ దులను దూఁగి,
ఘన నొప్పారు నప్పురి వనము లెల్ల. || 15||
చ. కనక విలాస కుంభములు గబ్బి కుచంబుల లీలఁ, జిత్రకే
తనములు పైఁట కొంగుల విధంబునఁ గ్రాల, గవాక్షముల్ రహిన్
గనుఁగవ యట్ల పొ ల్పెసఁగఁగా భువి భోగులు మెచ్చ భోగినీ
జనముల రీతిఁ జెల్వమరు సౌధ నికాయము పాయ కప్పురిన్. ||16||

తే. మకర, కఛ్ఛప, శంఖ, పద్మములు గలిగి,
ధనదు నగరమ్ముపైఁ గాలు ద్రవ్వుచుండు
సరస మాధుర్య గంభీర్య సరణిఁ భేర్చి
గుఱుతు మీఱిన య ప్పురి కొలఁకు లెల్ల || 17||

గీ. అమృత ధారా ప్రవాహమ్మునందు నెపుడు
నొక్క ధేనువు దివి నున్న నుచిత మగునె ?
అమృత ధారా ప్రవాహమ్మునందు నెపుడుఁ
బెక్కు ధేనువు ల ప్పురిఁ బేరు నొందు. ||18||

క. ఈ కరణి సకల విభవ
శ్రీకర మయి తాఁ బ్రసిద్ధిఁ జెలఁగుచు మహిమన్
నాక పురితోడ నొఱయుచు
సాకేత పురమ్ము వెలయు జగము నుతింపన్. ||19||

వ. అట్టి మహా పట్టాణంబున కధీష్వరుం డెట్టివాఁడనఁగ; || ||

సీ. తన కీర్తి కర్పూర తతిచేత వాసించెఁ
బటుతర బ్రహ్మాండ భాండ మెల్లఁ
దన శౌర్య దీప్తిచే నిన బింబ మనయంబుఁ
బగ లెల్ల మాఁగుడు వడఁగఁ జేసెఁ
దన దాన విఖ్యాతి ననుదినంబును నర్థి
దారిద్ర్యములు వెళ్ళఁ బాఱ దఱిమెఁ
దన నీతి మహిమచే జన లోక మంతయుఁ
దగిలి సంతతమును బొగడఁ దనరెఁ,

తే. భళిర ! కొనియాడాఁ బాత్రమై పరఁగినట్టి
వైరి నృప జాల మేఘ సమీఋఅణుండు,
దినక రాన్వయ పాధోధి వనజ వైరి,
నిశిత కౌక్షేయక కరుండు దశరథుండు. ||20||

సీ. పాలింపఁ డవినీతి పరుల మన్ననఁ జేసి
పాలించు సజ్జన ప్రతతి నెపుడు,
మనుపఁ డెన్నఁడుఁ జోరులను గారవము చేసి
మనుచు నాశ్రిత కోటి ఘనముఁగాగ,
వెఱ పెఱుంగఁడు వైరి వీరులఁ బొడగన్న
వెఱచు బొం కే యెడ దొరలునొ యని,
తలఁకఁడర్థి వ్రాతములు మీఱి పైకొన్నఁ
దలఁకు ధర్మ మ్మెందుఁ దప్పునొ యని,

తే. సరవిఁ బోషింపఁ డరి గణ షట్క మెపుడు,
వెలయఁ బోషించు నిత్యమ్ము విప్రవరుల,
భాస్క రాన్వయ తేజో విభాసితుండు,
మాన ధుర్యుండు దశరథ క్ష్మావరుండు. || 21||

సీ. కనఁగొరఁ డొక నాఁడుఁ గనులఁ బరవధూ
లావణ్య సౌభాగ్య లక్షణములు,
వినఁగోరఁ డొక నాఁడు వీనుల కింపుగాఁ
గొలుచువారలమీఁది కొండెములను,
చిత్తంబు వెడలించి జిహ్వాగ్రముఁ గోరి
పలుకఁడు కాఠిన్య భాషణములు,
తలఁపఁడించుకయైన ధన కాంక్షనే నాఁడు
బంధు మిత్త్రాశ్రిత్ర ప్రతతిఁ జెఱుప.

తే. సతత గాంభీర్య ధైర్య భూషణ పరుండు,
వార్త కెక్కిన రాజన్య వర్తనుండు,
సకల భూపాల జన సభాసన్నుతుండు,
ధర్మ తాత్పర్య నిరతుండు, దశరథుండు ||2||

సీ. విర హాతిశయమున వృద్ధిపొదఁగ లేక
విష ధరుండును గోఱ విషముఁ బూనె,
తాపంబు క్రొవ్వెంచి తరియింపనోపక
పలుమాఱుఁ గడగండ్ల బడియెఁ గరులు,
కందర్ప శరవృష్టి నంద నోపక ఘృష్టి
వనవాసమునఁ గ్రుస్సి వనరు సూపె,
దీపించి వల పాప నోపక కూర్మంబు
కుక్షిలోపలఁ దలఁ గ్రుక్కి కొనియె,

తే. కుంభినీ కాంత తమమీఁది కూర్మి విడిచి
ప్రకట రాజన్య మస్త కాభరణ మకుట
చారు మాణిక్య దీపిత చరణుడైన
దశరథ దాధీశు భుజ పీఠిఁ దగిలి నంత. ||23||

క. ఆ రాజు రాజ్యమందలి
వారెల్లను నిరత ధర్మ వర్తనులగుచున్
భూరి స్థిర విభవంబుల
దారిద్ర్యం బెఱుంగ రెట్టి తఱి నే నాఁడున్. ||24||

వ. ఇట్టి మహా ధైర్య సంపన్నుందును, మహైశ్వర్య ధుర్యుండును నగు దశరథ మహారాజు సకల సామంత రాజ లోక పూజ్యమానుఁ డగుచుఁ బ్రాజ్యంబగు రాజ్యంబు నేలుచు నొక్కనాఁడు ||25||

దశరథుఁడు పుత్రకామేష్టి కావించుట

సీ. సంతాన లబ్ధికై చింతించి,
శిష్ట వర్తనుఁ డౌ వశిష్ఠుఁ జూచి,
తన కోర్కి వినుపింప, విని మునిసింహుండు
పలికె ఋశ్యశృంగు నెలిమిఁదేర,
ఘనుఁ డాతఁ డొగిఁ బుత్రకామేష్ఠి యనుపేర
యాగమ్ముఁ గావింప, నందువలన
వినుతి కెక్కఁగఁ జాలు తనయులు గలుగుట
సిద్ధమ్ము, నామాట బుద్ధిలోన

తే. నిలుపు మని చెప్ప నా రాజు నెమ్మితోడ
నకుటి లాత్మకు నా విభాండకుని తనయు
నెలమి రావించి, పుత్రకామేష్టి యనెడి
జన్న మొనరించు చున్నట్టి సమయమునను, ||26||

సురల మొఱ లాలించి శ్రీ మహావిష్ణువభయ మొసంగుట

ఉ. రావణుచేతి బాధల నిరంతరమున్ బడి వేఁగి, మూఁకలై
దేవత లెల్ల గీష్పతికిఁ దెల్లముగా నెఱిఁగింప, వారి రా
జీవ తనూజుఁ డున్నెడకు శీఘ్రము తోడ్కొనిపోయి చెప్ప, నా
దేవుఁడు విష్ణు సన్నిధికి దిగ్గనఁ జేకొనిపోయి యిచ్చటన్, ||27||

వ. అప్పురాణ పురుషోత్తముఁ గాంచి, నమస్కరించి, యింద్రాది దేవతలం జూపి, బ్రహ్మ యిట్లని విన్నవించె; ||28||

ఉ. రావణుఁ డుగ్రుఁడై తన పరాక్రమ శక్తిని వీరి సంపదల్
వావిరిఁ గొల్లలాడి త్రిదివంబును బాడుగఁ జేయ, నేఁడు దే
వావళి దీన భావమున నక్కడ నుండఁగ నోడి, భీతిచే
చేవరఁ గానవచ్చె నిఁక దేవర చిత్తము వీరి భాగ్యమున్. ||29||

వ. అని విన్నవించిన విని వనరులోచనుందు దయాయత్త చిత్తుండై యనిమిషనాయకుని గూర్చి యిట్లానతిచ్చె; ||30||

తే. వనజ గర్భుని గుర్చి రావణుఁడు మున్ను
తపముఁజేసిన వర మిచ్చుతఱినిఁ దనకు
నేరిచేఁ జావు లేకుండఁ గోరువాఁడు
నరుల వానరులను జెప్ప మఱచినాఁడు ||31||

వ. అ క్కారణంబునం జేసి, ||32||

తే. వనరు గలిగెను మనకు రావణుని జంప,
వినుఁడు మీరెల్ల నామాట వేడ్క మీఱ,
దశరథుం డనురాజు సంతాన కాంక్ష
నొనర జన్నంబు గావించుచున్నవాఁడు ||33||

క. ధరణిపతి యగు దశరథ
నరనాయకు నింటఁ బుట్టి నర రూపమునం
బెరిగెద; మీరును, మేమును
సుర కంటకు మీఁద లావు సూపుటకొఱకై ||34||

క. కొందఱు కపి వంశంబునఁ
గొందఱు భల్లుక కులమున గురు బలయుతులై
యందఱు నన్ని తెఱంగుల
బృందారకులార! పుట్టి పెరుగుఁడు భువిపై ||35||

వ. అని, కృపా ధురీణుండైన నారాయణుఁ డనతిచ్చిన విని, వనజాసనాది దేవతా నికరం బవ్వనజోదరుని పాదారవిందమ్ములకు వందనమ్ము లాచరించి, నిజ నివాసమ్ములకుం జని రయ్యవసరమ్మున. ||36||
అగ్నిదేవుఁడు ప్రత్యక్షమై దశరథునకుఁ బాయస మిచ్చుట

మ. ఇల సాకేత నృపాల శేఖరుఁడు దా హేలా విలాసంబుతో
ఫల కాంక్షన్ గ్రతువుం బొనర్చినయెడన్ బంగారు పాత్రమ్ము లో
పల దుగ్ధాన్నము చాల నించుకొని తాఁ బ్రత్యక్షమ్మై నిల్చి ని
ర్మల తేజంబునఁ బావకుండనియెఁ బ్రేమన్ మంజు వాక్యంబులన్. ||37||

క. భూపాల ! నీదు భార్యల
కీ పాయస మారగింప నిమ్మీ ! తనయుల్
శ్రీపతి పుత్త్ర సమానలు
రూపసు లుదయింతు రమిత రూప స్ఫూర్తిన్. ||38||

వ. అని చెప్పి య ప్పాయస పాత్రంబు చేతి కిచ్చిన ||39||

ఆ. పాయసమ్ము రెండు భాగముల్ గావించి,
యగ్ర సతుల కీయ, నందులోన
సగము సగము దీసి మగుద సుమిత్రకు
నొసఁగి, రంత నామె మొసవెఁ బ్రీతి. ||40||

కౌసల్యా కైకేయి సుమిత్రల దౌహృద లక్షణములు

వ. అంతం గొన్ని దినంబులకుఁ గౌసల్యా కైకేయీ సుమిత్రలు గర్భవతులై యొప్పారుచుండ, ||41||

సీ. ధవళాక్షులను మాట తథ్యంబు గావింపఁ
దెలు పెక్కి కన్నులు తేట లయ్యె,
నీల కుంతల లని నెగడిన యా మాట
నిలుపంగ నెఱులపై నలుపు సూపె,
గురు కుచ లను మాట సరవి భాషింపంగఁ
దోరమై కుచముల నీరు వట్టె,
మంజు భాషిణులను మాటదప్పక యుండ
మొలఁతల పలుకులు మృదువు లయ్యెఁ

తే. గామిను లటంట నిక్కమై కాంతలందు
మీఱి మేలైన రుచులపైఁ గోరి కయ్యె,
సవతి పోరనఁ దమలోన సారె సారె
కోకిలింతలు, బెట్టు చిట్టుములుఁ బుట్టె. ||42||

వ. మఱియును

సీ. తను మధ్య లను మాటఁ దప్పింప గాఁబోలుఁ
బొఱ లేక నడుములు పొదలఁ జొచ్చెఁ
గుచములు బంగారు కుండలూ యను మాట
కల్లగా నగ్రముల్ నల్ల నయ్యెఁ,
జంద్రాస్యలను మాట సందియమ్ముగఁ బోలు
గర్భ భారమ్ములఁ గాంతి దప్పె.

తే. ననుచుఁ గనుగొన్న వారెల్ల నాడుచుండఁ,
గట్టు చీరెల వ్రేఁకంబు పుట్టుచుండఁ,
నా సతులఁ జూచి యందఱు నలరుచుండఁ,
గాంతలకు నంత గర్భముల్ కానుపించె. ||44||

శ్రీరామ భరత లక్ష్మణ శత్రుఘ్నుల యవతారము

వ. ఇట్లు దుర్భరంబులైన గర్భంబులు దాల్చిన కౌసల్యాది కాంతా త్రయమ్మును జైత్ర మాసమ్మున, శుక్ల పక్షమ్మున, నవమీ, భాను వాసరమ్మునఁ, బునర్వసు నక్షత్రమ్మునఁ, గర్కటక లగ్నంబున శ్రీరామభరతశత్రుఘ్నులంగాంచినం ద దనంతరంబున దశరథుండు యథోచిత కర్తవ్యంబులు జరిపి యప్పది దినంబులు నరిష్టంబు లేక ప్రతి దిన ప్రవర్ధమాన మగుచున్న కుమార చతుష్ట యంబునకుఁ గాలోచితంబు లగు చౌ లోపనయ నాది కృత్యంబులు గావించి, వెండియు విద్యా ప్రవీణు లగునట్టు లొనర్చి, గజాశ్వ రథా రోహణంబులు నేర్పి, ధనుర్వేద పారగులం గావించి, పెంచుచున్న సమయమ్మున. ||45||

యాగ రక్షణమునకు రాముని బంపుమని విశ్వామిత్రుని వేఁడికోలు

సీ. ఒకనాఁడు శుభగోష్ఠి నుర్వీశ్వరుఁడు మంత్రి
హిత పురోహితులును నెలమిఁ జేరి,
బంధు వర్గము రాయబారులుఁ జారులుఁ
బరిచారకులు నెల్ల సరవిఁజేరి
గాయక్లును భృత్య గణములు మిత్త్రులు
సతులును సుతులును జక్క నలరి,
సరసులుఁ జతురులుఁ బరిహాసకులుఁ గళా
వంతులు గడు నొక్క వంకఁ జేరి

తే. కొలువఁ గొలు వున్నయెడ, వచ్చి కుశికపుత్త్రుఁ
డర్థి దీవించి, తా వచ్చినట్టి కార్య
మధిపునకుఁ జెప్ప, మదిలోన నదరిపడుచు
వినయ మొప్పార నిట్లని విన్నవించె; ||46||

క. రాముఁడు దనుజులతో సం
గ్రామము సేయంగఁ గలఁడే ? కందు గదా ! నే
నే మిమ్ము గొలిచి వచ్చెద
నో మునిరాజేంద్ర ! యరుగు ముచిత ప్రౌఢిన్. ||47||

మ. అనినం గౌశికుఁడాత్మ నవ్వి, విను మయ్యా ! రాజ నీచేతఁగా
దనరా దైనను రాక్షసుల్ విపుల గర్వాటోప బాహా బలుల్
ఘనుఁడీ రాముఁడు దక్క వారి గెలువంగా రాదు, పిన్నంచు నీ
వనుమానింపక పంపు మింకఁ, గ్రతు రక్షార్ధంబు భూనాయకా ! ||48||

వ. అని ప్రియోక్తులు పలుకుచున్న విశ్వామిత్రునకు మిత్త్రకుల పవిత్రుండైన దశరథుందు మాఱాడ నోడి యప్పుడు ||49||

క. మునినాథు వెంట సుత్రా
ముని నలజడి వెట్టుచున్న మూర్ఖులపై రాముని సౌమిత్రిని వెస నమ్మునితో నానంద వార్థి మునుఁగుచుఁ బనిచెన్ ||50||

కౌశికుని యాజ్ఞపై రాముడు తాటకను గూల్చుట

మత్త. వారిఁ దోడ్కొని కౌశికుండట వచ్చు నయ్యెడ ఘోర కాం
తార మధ్యమునందు నొక్కతె దైత్య కామినీ భీకరా
కార మొప్పఁగ నట్టహాస వికార మేర్పడ వచ్చునా
క్రూర రాక్షసిఁజూసి యమ్ముని కుంజరుం డొగి రామునిన్. ||51||

క. తాటక వచ్చిన దదిగో
తాటది యని యెంచుచు మొగమాడక నీ వీ
పాటి పడవేయు మని తడ
బాటున శంకించు రామ భద్రున కనియెన్ ||52||

వ. ఇట్లు చెప్పిన యామునిచంద్రుని పల్కులాలించి, రామచంద్రుండు తన యంతరంగమ్మున నిట్లని వితర్కించె; ||53 ||

ఈ యాఁడుదానిఁ జంపఁగ
నా యమ్మున కేమి గొప్ప ? నగరే వీరుల్?
చీ యని రోయుచు నమ్ముని
నాయకు భయ మెఱిఁగి తన మనమ్మున నలుకన్. ||54 ||

క. వ్రేటు గొని రామచంద్రుఁడు
సూటిగ నొక దిట్ట కోల సురలు నుతింపన్
ఘోటక సమ వక్షస్థలఁ
దాటక నత్యుగ్రలీల ధరపైఁ గూల్చెన్ ||55||

వ. ఇట్లు తాటకం గీటణంచినయంత, న మ్మునీంద్రుందు మేటి సంతోషమ్మున రామునిం గొనియాడుచు, నశ్రమంబున నిజాశ్ర మంబున కేఁతెంచి, రామ సౌమిత్రుల సాయంబున జన్నంబుసేయుచున్న సమయంబున ||56||
రాముఁడు రాక్షసులను జంపి తపసి జన్నమును గాచుట

క. ఆకాశవీధి నెలకొని
రాకాసులు గురిసి రమిత రక్తముఁ, బలలం
బా కౌశికు యజ్ఞముపై
భీకరముగ ముని గణంబు భీతిన్ బొందన్ ||57||

ఉ. అంబర వీధి నిల్చి త్రిదశాంతకు లెంతయు నేచి, రక్తమాం
సంబులు గాధి నందనుని జన్నముపైఁ గురియంగ, నంతలో
నంబర రత్న వంశ కలశాంబుధి చంద్రుఁడు, రామచంద్రుఁడు
గ్రంబుగఁద్రుంచెఁ జండ బల గర్వులఁ దమ్ముఁడు దాను నొక్కటై ||58||

వ. ఇట్లు రామచందృండు సాంద్ర ప్రతాపంబు మించ నింద్రారులఁ ద్రుంచిన న మ్మునిచండ్రుఁడు నిర్విఘ్నంబుగా జన్నం బొనర్చి రామ సౌమిత్రులంబూజించె నట్టి సమయమ్మున;

క. ధరణీ సుత యగు సీతకుఁ
బరిణయ మొనరింప జనక పార్థివుఁ డిల భూ
వర సుతుల రం డని స్వయం
వర మొగిఁ జాటించె నెల్ల వారలు వినఁగన్ ||60||

వ. ఇట్లు స్వయంవర మహోత్సవ ఘోషంబున సంతోషమ్ము నొంది విశ్వామిత్రుండు రామ సౌమిత్రుల మిథిలా నగరంబునకుఁ దోడ్కొని, చనుచుండు మార్గంబున; ||61 ||

శ్రీ రాముని పాద ధూళి సోక నహల్యయైన శిల

ద. ముదితాపసి వెనువెంటను
వదలక చనుదెంచునట్టి వడి రాముని శ్రీ
పద రజము సోఁకి, చిత్రం
బొదవఁగఁ దనుపట్టే నెదుట నొక యుపల మటన్ ||62||

క. పదనై, యొప్పిదమై, దడుఁ
గదలుచు బంగారు పూదె కరఁగిన రీతిన్
మొదలుచు, లావణ్య స్థితి
సుదతిగఁ జూపట్టి నిలిచె సురుచిర లీలన్. ||63||

ఉ. ఆ ముని వల్లభుండు కొనియాడుచుఁ బాడుచు, వేడ్కతోడ శ్రీ
రాముని జూచి యట్లనియె, రామ! భవ త్పద ధూళి సోఁకి, యీ
భామిని రాయి మున్ను, కులపావన! చూడఁగఁ జిత్రమ్మ్యె నీ
నమ మెఱుంగు వారలకు నమ్మఁగ వచ్చును భుక్తి ముక్తులున్ ||64||

వ. అని యక్కాంతా రత్నంబు పూర్వవృత్తాంతం బంతయునెంతయు సంతసమ్మున నమ్మ్నుజేంద్ర నందనుల కెఱింగింపుచు, మిథిలా నగరంబునకుం జనియె నచ్చట; ||65||

సీతా స్వయంవరము

సీ. ద్రవిడ కర్ణాటాంధ్ర యవన మహారాష్ట్ర
రాజ కుమారులు తేజ మలరఁ,
బాండ్య ఘూర్జర లాట బర్బర మళయాళ,
భూప నందనులు విస్ఫూర్తి మీఱ,
గౌళ కేరళ సింధు కాశి కోసల సాళ్వ
ధరణిశ పుత్రులు సిరి వెలుంగ,
మగధ మత్స్య కళింగ మాళవ నేపాళ
నృప తనూభవులు నెన్నికకు నెక్క,

తే. మఱియు నుత్కల కొంకణ ముద్ర పౌండ్ర
వత్స గాంధార సౌరాష్ట్ర వంగ చోళ
రాజ్యముల నొప్పు ఛప్పన్న రాజ సుతులు
వచ్చి రక్కామినీ స్వయంవరమునకును ||66||

కొందఱు పల్లకీ, మఱి కొందఱు తేరుల, నందలంబులం
గొందఱు, కొంద ఱశ్వములఁ, కొందఱు మత్త గజేంద్ర సంఘమున్
గొందఱు స్వర్ణ డోలికలఁ, గోరిక నెక్కి నృప నందనుల్
సందడిఁగాఁగ వచ్చిరి, బుజంబు బుజంబును ద్రోపులాడఁగన్. ||67||

వ. అట్టి సమయంబున ||68||

చ. గురు భుజశక్తి గల్గు పదికోట్ల జనంబులఁ బంప, వారు నా
హరుని శరాసనంబుఁ జొనియాడుచుఁ బాదుచుఁ గొంచు వచ్చి, సు
స్థిరముగ వేది మధ్యమునఁ జేర్చిన, దానికి ధూప దిపముల్
విరులును గంధ మక్షతలు వేదుక నిచ్చిరి చూడ నొప్పుగన్ ||69||

వ. అట్టి సమయంబున జనక భూప్లాలుందు రాజ కుమారులం గనుం గొని యిట్లనియె; ||70||

శివ ధనువు నెక్కు పెట్టిన ధీరునకు సీత నిత్తునని జనకుని ప్రకటన

ఉ. కొంకక సావధాన మతిఁ గూర్చి వినుం డిదె, మ త్తనూజకై
యుంకువ సేసిఁనాడ వివిధోజ్జ్వల మైన ధనంబుఁ, గాన నీ
శంకరు చాప మెక్కిడిన సత్త్వఘనుం డగువాని కిత్తునీ
పంకజనేత్ర సీత, నరపాలకులార! నిజంబు సెప్పితిన్. ||71||

ఆ. అనుచుఁ బలుకుచున్న యవనీశ తిలకుని
వాక్యములకు నుబ్బి, వసుమతీశ
సుతులు దామ తామె మతిలోనఁ జెలఁగుచు
దగ్గఱంగఁ బోయి ధనువుఁ జూచి, ||72||

రాజ కుమారులు శివ చాపమును గదల్ప నోడుట

క. విల్లా? యిది కొండా? యని
తల్లడపడి సంశయంబు తలకొన మదిలో
బల్లిదు లగు నృప నందను
లెల్లరు దౌ గవుల నుండి రెంతయు భీతిన్ ||69||

క. కొందఱు డగ్గఱ నోడిరి,
కొందఱు సాహసము చేసి కోదండముతో
నందంద పెనఁగి పాఱిరి
సందుల గొందులను దూఱి, సత్త్వము లేమిన్. ||74||

సీ. గాలిఁ దూలిన రీతిగా నెత్తఁ జాలక
తముఁ దామె సిగ్గునఁ దలను వంచి,
కౌఁగిలించిన లోను గాక వెగ్గల మైన
భీతిచే మిక్కిలి బీరువోయి,
కరముల నందంద పొరలించి చూచినఁ
గదలక యున్నఁ జీకాకు నొంది,
బాషాణ మున్నట్టి పగిది మార్దవ మేమిఁ
గానరాకుండినఁ గళవళించి,

తే. రాజ సూనులు కొందఱు తేజ ముడిగి,
జగతి రాజుల మోసపుచ్చంగఁ దలఁచి,
జనకుఁడీ మాయఁ గావించె, జాలు ననుచుఁ
దలఁగి పోయిరి దవ్వుగా ధనువు విడిచి. ||75||

సీ. ఇది పర్వతాకార, మీవిల్లు కను విచ్చి
తేఱి చూడఁగ రాదు దేవతలకు,
నటుగాక ముణు శేష కటకుని ధను వంట,
హరుఁడె కావలెఁగాక, హరియుఁగాక,
తక్కినవారికిఁ దరమె యీ కోదండ
మెత్తంగఁ? దగు చేవ యెట్లు గలుగు?
దీ డగ్గఱ నేల ? దీని కోడఁగ నేల?
పరులచే నవ్వులు పడఁగ నేల?

తే. గుఱుఁతు సేసియుఁ దమ లావు కొలఁదిఁ దామె
తెలియవలెఁ గాక, జూరక తివుర నేల?
యొరుల సొమ్ములు తమ కేల దొరకు? ననుచుఁ
దలఁగి పోయిరి రాజ నందనులు గనుచు ||76||

వ. అంత విశ్వామిత్ర మునీంద్రుండు రామచంద్రుని ముఖావలోక నంబుఁజేసిన ||77||

మునియానతి శ్రీ రామునిచే శివ ధనుర్భంగము

చ. కదలకుమీ ధరాతలము, కాశ్యపిఁబట్టు, ఫణీంద్ర భూ విషా
స్పదులను బట్టు, కూర్మమ రసాతల భోగి ఢులీ కులీశులన్
వదలక పట్టు ఘృష్టి ధరణీ కచ్చప పొత్రి వర్గమున్
బొదువుచుఁ బట్టుఁడీ కరులు, భూవరుఁడీశుని చాపమెక్కిడున్ ||78||

క. ఉర్వీ నందనకై రా
మోర్వీపతి యొత్తు నిప్పు డుగ్రుని చపం
బుర్విం బట్టుఁడు దిగ్దం
త్యుర్వీధర కిటి ఫణీంద్రు లూతఁతఁగ గడిమిన్ ||79||

వ. అనుచు లక్ష్మణుందు దెలుపుచున్న సమయంబున ||80||

మ. ఇన వంశోద్బవుఁడైన రాఘవుఁడు, భూమీశాత్మజుల్ వేడ్కతోఁ
దను వీక్షింప, మునీశ్వరుం డలరఁ, గోదండంబుచే నంది, చి
వ్వన మోపెట్టి, గుణంబు పట్టి, పటు బాహా శక్తితోఁ దీసినన్,
దునిఁగెన్ జాపము భూరి ఘోషమున, వార్ధుల్ మ్రోయుచందంబునన్. |81||

ఆ. ధనువు దునిమినంత ధరణీశ సూనులు
శిరము లెల్ల వంచి సిగ్గు పడిరి;
సీత మేను వంచె; శ్రీ రామచంద్రుని
బొగడె నపుడు జనక భూవిభుండు ||82||

సీతా రాముల కళ్యాణ వైభవము

ఇట్లు శ్రీరామచంద్రుని సత్త్వ సంపదకు మెచ్చి, సంతోషించి, జనక మహారాజు వివాహంబు సేయువాఁడై రమ్మని దశరథేశ్వరుని పేరిట శుభలేఖలు వ్రాయించి పంచిన, దశరథ మహారాజును నా శుభ లేఖలం జదివించి, సంతోషంబున నానంద బాష్పంబులు గ్రమ్ముదేర మంత్రి ప్రవరుండగు సుమంత్రునిం బిలిపించి, "సుమంత్రా యిపుడు మన మందఱమును బయలుదేఱి, మిథిలా పట్టణంబునకుం బోయి, యట జనక మహారాజు నింట మన రామలక్ష్మణ భరత శత్రుఘ్నులకు వివాహ మహోత్సవము జరుపవలయుఁ, గావున వశిష్టాది ద్విజ వర్యులను గౌసల్యాది కాంతా జనమ్మును, నరుంధతి మొదలగాఁగల భూసుర భార్యలను మఱియు సకల బంధు జనంబును రావించి, బంగరుటరదంబుల నిడికొని దోడ్కొనిరమ్మని యంపిన నతండును మహా ప్రసాదంబని తక్షణము యంతహ్పురంబునకుం బోయి, కౌసల్య కైక సుమిత్ర మొదలుగాఁ గల ముత్తైదువలను మిగిలిన సకల బంధు జనమ్మును రావించి, యుక్త ప్రకారమ్ముగాఁ గనక రథమ్ములపై నిడికొని, దశరథ మహారాజు కడకుం గొనివచ్చిన, యంత దశరథుండు పుత్ర ద్వయసహితమ్ముగ రథ మారోహించి, సమస్త సేనా సమన్వితుండగుచు వాద్య ఘోషంబులు దశ దిశలు నిండ, నడుచుచున్న సమయమ్మున; నంతకు ముందు జనక భూవల్లభుండు దశరథ మహీపాలు నెదుర్కొని, తోడితెచ్చి, యడుగులు గడిగి, యర్ఘ్యపాద్యాది విధుల విధ్యుక్తంబుగాఁ బూజించి, మానితం బుగఁ గానుక లొసంగి, సకల సంపత్సంపూర్ణమయిన నివేశముంగల్పించి, యందుఁ బెండ్లివారిని విడియించె, నంత నక్కడఁ గనక వికారమైన పీఠమ్ముపైఁ గూర్చున్న సమయమ్మున "దేవా! శుభముజూర్తంబాసన్న మగుచున్నది ర" మ్మని వశిష్టుండు సనుదేర, నాతఁదు సని, రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులకు మంగళ స్నానమ్ముఁజేయించి, నిర్మలాంబరాభరణంబు లొసంగి, వేర్వేఱ నొక్క ముజూర్తమునందున కూఁతు సీతను శ్రీరామచంద్రునకును, దన తమ్ముఁడు కుశధ్వజుని కూఁతు లగు మాండ వ్యూర్మిళా శ్రుత కీర్తులను భరత లక్ష్మణ శత్రుఘ్నులకును నిచ్చి, వివాహముం జేసి, తన ప్రియ తనయల కొక్కొకతెకు నూఱేసి భద్ర గజమ్ములను, వేయేసి తురంగంబులును, బదివేలు దాసీ జనమ్మును, లక్ష ధేనువులును నరణంబులిచ్చి, దశరథాది రాజలోకమ్మునకు బహుమానమ్ముగా నవరత్న ఖచిత భూషణమ్ములును, జీని చీనాంబరమ్ములును నొసంగి, సుగంధి ద్రవ్యములనర్పించి, పూజించియంపె; నంతదశరథ మహారాజు మరలి యయోధ్యా పట్టణంబునకు వచ్చుచుండఁగా మధ్యేమార్గంబున. ||83||
దశరథరాముని గని పరశురాముని యథిక్షేపము

ఆ. పరశురాముఁ! డడ్డుపడి వచ్చి, మీ నామ
మెవ్వ రనిన, మొలక నవ్వుతోడ
నేను దశరథుండ, నితడు నా పుత్త్రుండు,
రాముఁ డంద్రు పేరు, భీమ బలుఁడు ||84||

వ. అని వినిపించినఁ గ్రోధావేశవశంవదుండై యప్పు డ ప్పరశు రాముండు రాముం గనుంగొని యిట్లనియె; ||85||

క. రాముఁడు నేనై యుండఁగ
నామీఁద నొకండు గలిగెనా మఱి? యౌఁగా
కేమాయె రణ మొనర్పఁగ
రామా రమ్మునుచుఁ బరశురాముఁడు పిలిచెన్ ||86||

వ. పిలిచినతోడనే రామచంద్రుం డతని కిట్లనియె ||87||

ఆ. బ్రాహ్మణుండ వీవు పరమ పవిత్రుండ
వదియుఁ గాక భార్గ వాన్వయుండ
వైన నిన్నుఁ దొడరి యాహవ స్థలమున
జగడ మాడ నాకుఁ దగునె చెపుమ ?
వ. అనిన విని పరశురాముం డిట్లనియె; ||89||

ఉ. శస్త్రముఁ దాల్చినం దగునె ? సన్నుతి కెక్కిన భార్గవుండనన్
శాస్త్రము గాదు, నా కెదిరి సంగర భూమిని నిల్చినంతనే
శస్త్ర ముఖంబులన్ నృపులఁ జక్కుగఁ జేయుఁదుఁగాన నిప్పుడున్
శస్త్రము శాస్త్రముం గలవు సాహస వృత్తిని రమ్ము పోరఁగన్. ||90||

వ. అనిన రామచంద్రుం డిట్లనియె; ||91||

విను, మావంటి నృపాలురైనఁగలనన్ వీరత్వముం జూపఁగా
ననువౌఁగాక, మహానుభావుఁడవు విన్నాలంబులో మీఱఁగా
నెనయన్ ధర్మువె మాకుఁ జూడ ? మఱి నీ వేమన్న నీ మాటకుం
గనలన్ బంతము కాదు మా కెపుడు దోర్గర్వంబు మీ పట్టున్ ||92||

వ. అనిన విని యెంతయు సంతోషించి భార్గవరాముం డా రఘురామునితో నిట్లనియె; ||93||

ఆ. శివుని చివుకు విల్లు శీఘ్రంబె యలనాఁడు
విఱిచినాఁడ ననుచు విఱ్రవీఁగ
వలదు, నేఁడు నాకు వశమైన యీ చాప
మెక్కు పెట్టితివియు మింతె చాలు ||94||

ఉ. రాముఁదు గీముఁ డంచును ధరా జనులెల్ల నుతింప దిట్టవై
భీముని చాపమున్ విఱిచి ప్రేలెద వందుల కేమిగాని, జీ
శ్రీ మహిళేశు కార్ముకముఁ జేకొని యెక్కిడుదేని నేఁడు నీ
తో మఱి పోరు సల్పి పడఁద్రోతు రణస్థలి నీ శరీరమున్. ||95||

శ్రీరాముఁడు పరశురాముని నారాయణ చాపముతోఁగూడ విష్ణు తేజము నందికొనుట

చ. అని తన చేతివిల్లు నృపు లందఱుఁ జూడగ నంది యీయ, నా
ధనువును గూడి తేజముఁ బ్రతాపము రాముని జెందె, నంతనే
జనవరుండా శరాసనముఁ జక్కఁగ నెక్కిడి వాఁడి బాణ మం
దున నిడి యేది లక్ష్యమనఁ ద్రోవలు సూపినఁద్రుంచె గ్రక్కునన్ ||96||

వ. ఇట్లు మహా ప్రతాపంబున నా విలు ద్రుంచి, యనర్గల ప్రతాపమ్మున భార్గవ రాము దోర్గర్వంబు నిర్గర్వంబు గావించి, జయమ్ముఁ గైకొన్న కుమారుని గౌఁగిలించుకొని, దశరథుండు కుమార చతుష్టయమ్ముతో నయోధ్యా నగరంబు బ్రవేశించి సుఖోన్నతి రాజ్యంబు నేలుచున్న సమయంబున, ||97||

శా. పారావార గభీరికిన్, ద్యుతి లస త్పద్మారికిన్, నిత్య వి
స్ఫారొదార విహారికిన్, సుజన రక్షా దక్షారికిన్
సారాచార విచారికిన్ మద రిపు క్ష్మాపాల సంహారికిన్
వీరా సాటి నృపాలకుల్? దశర థోర్వీనాథ జంభారికిన్ ||98||

వ. అని కొనియాడఁ దగిన నృపాల శేఖరుఁడు ధర్మమార్గంబు నొక్కింత యేనిఁ దప్పకుండ రాజ్యంబు సేయుచుండె ననుట విని నారదుని వాల్మీకి మహా మునీశ్వరుం దట మీఁది కథావిధానం బెట్టిదని యడుగుటయు. ||99||

ఆశ్వాసాంత పద్య గద్యములు

క. కమలాక్ష ! భక్త వత్సల!
జలజాసన వినుత పాద జలజాత ! సుధా
జలరాశి చారు హంస ! జానకి నాథా ! ||100||

గద్యము

ఇది శ్రీ గౌరీశ్వర వరప్రసాద లభ్ద గురు జంగమార్చన వినోద సూరి జన వినుత కవితా చమత్కారాతుకూరి కేసనసెట్టి తనయ మొల్ల నామధేయ విరచితంబైన శ్రీ రామాయణ మహాకావ్యంబునందు బాలాకాండము సర్వము నేకాశ్వము.


No comments:

Post a Comment